Leading News Portal in Telugu

Odisha: బీజేడీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత ఔట్



Odisa

సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు. ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడడం బీజేడీకి పెద్ద షాక్‌కే తగలింది. ఐదోసారి అధికారం కోసం ఎన్నికల రంగంలోకి దిగుతున్న నవీన్ సర్కార్‌కు ఊహించని దెబ్బగానే చెప్పొచ్చు.

ఇటీవల ఒడిశా నటుడు అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేడీలో అరిందమ్ ముఖ్య నేతగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హ్యాండిచ్చాడు. తాజాగా కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీని వీడారు. ఈయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తు కుదరలేదు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు మన్మోహన్ సమాల్ స్పష్టం చేశారు. 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆయన తేల్చి చెప్పారు. మోడీ సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపించబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు చేరకుండా పోతున్నాయని మన్మోహన్ సమాల్ నవీన్ పట్నాయక్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

మొత్తానికి ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీతో బీజేపీ పొత్తు లేదని తేలిపోయింది. ఇక ఆ రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బీజేపీ నాలుగు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాల్గో జాబితాలో 15 మంది అభ్యర్థులను వెల్లడించింది. మొత్తం ఇప్పటి వరకు 291 స్థానాల్లో అభ్యర్థులకు కాషాయ పార్టీ ఖరారు చేసింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.