Leading News Portal in Telugu

Karnataka: బీజేపీ-జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు.. ఎన్నెన్ని సీట్లంటే..!



Jds

మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రాధా మోహన్ దాస్ అగర్వాల్ శనివారం ప్రకటించారు.

మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేయనుండగా, జేడీఎస్ 3 సీట్లలో బీజేపీ మద్దతుతో పోటీ చేయనుంది. కర్ణాటలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రెండో విడతల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 26న, మూడో ఫేజ్‌లో భాగంగా మే 7న జరుగనున్నాయి.

రెండో విడత పోలింగ్‌లో కర్ణాటకలోని 14 సీట్లకు పోలింగ్ జరగనుంది. వాటిలో బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, చామరాజనగర్, చిక్‌బల్లాపూర్, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, హస్సన్, కోలార్, మాండ్య, మైసూరు, తుంకూరు, ఉడిపి చిక్‌మగళూరు ఉన్నాయి.

మూడో దశలో మిగిలిన 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాటిలో చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బిజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారీ, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దేవనాగెరె, షిమోగా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధించాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు మోడీ కూడా ప్రజలకు విజ్ఞప్త చేస్తున్నారు. వికసిత భారత్‌కు మద్దతు తెల్పాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి హార్ట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు ఈసారి సీటు దక్కలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక కాంగ్రెస్ కూడా కర్ణాటకలో అభ్యర్థులను ప్రకటించింది.