
భూటాన్‌లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి ప్రభుత్వ పెద్దలు మోడీకి అత్యంత గౌరవ మర్యాదలు అందించారు. ఇక పర్యటన అనంతరం భూటాన్ నుంచి శనివారం బయలుదేరిన ప్రధాని.. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌కు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మోడీ తిరుగు ప్రయాణమవుతుండగా భూటాన్ రాజు సాగనంపడానికి షెరింగ్ టోబ్‌గే విమానాశ్రయానికి కూడా వచ్చారు. గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.
భూటాన్ పర్యటనపై మోడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో భూటాన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఢిల్లీకి బయల్దేరినప్పుడు విమానాశ్రయానికి వచ్చినందుకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌కు ధన్యవాదాలు. మీనుంచి పొందిన ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నారు. హిజ్ మెజెస్టీ ది కింగ్, భూటాన్‌లోని ఇతర ప్రముఖులను కలిసే అవకాశం లభించిందని గుర్తుచేశారు. అక్కడి ప్రజల ఆప్యాయత, ఆతిథ్యం మర్చిపోలేనిదని.. మన మధ్య జరిగిన చర్చలు భారత్-భూటాన్‌ల మధ్య స్నేహానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆకాంక్షించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్‌కు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా ఉంటుందంటూ మోడీ రాసుకొచ్చారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ థింపూలో గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా వాంగ్‌చుక్ తల్లీపిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి పూర్తి నిధులు సమకూర్చినందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ ప్రధాని టోబ్గే కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ప్రధాని మోడీ 10 వేల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసింది. మోడీ చేసిన ఈ సహాయానికి భూటాన్ ప్రధాని టోబ్గే ఆయనను తమ అన్నయ్యగా భావిస్తున్నామని తెలిపారు.
ఇక మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ లభించింది. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోడీయే కావడం విశేషం. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇంధన సహకారానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. రైలు మార్గం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన కుదుర్చుకున్నారు.
ఇది కూడా చదవండి:Hardeep Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
I am honoured by the special gesture by His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck of coming to the airport as I leave for Delhi.
This has been a very special Bhutan visit. I had the opportunity to meet His Majesty the King, PM @tsheringtobgay and other… pic.twitter.com/OFJ4y2w0FJ
— Narendra Modi (@narendramodi) March 23, 2024