Leading News Portal in Telugu

Kerala: రాష్ట్రపతి, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్



Kerala

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ తీరును కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు వారి ప్రవర్తనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏడు బిల్లులను ఎలాంటి కారణం లేకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని, అనంతరం రాష్ట్రపతి కూడా అదే విధంగా వ్యవహరించారని.. దీంతో శాసనసభ ప్రయోజనం మరియు పనితీరు అసమర్థంగా మారిందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేరళ సర్కార్ అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్రపతి దగ్గర నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశారని పినరయి సర్కార్ ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను కూడా సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన దగ్గర ఏడు బిల్లులు పెండింగ్‌లో పెట్టుకున్నారని.. అందులో నాలుగు బిల్లులు చాలా జాప్యం తర్వాత రాష్ట్రపతికి పంపగా.. అక్కడ కూడా పెండింగ్‌లో ఉండిపోయాయని పిటిషన్‌లో వివరించింది. ఇలా అసాధారణ జాప్యం చోటుచేసుకోవడం చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగంలోని సెక్షన్ 14ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 22 సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా చేసినట్టు అవుతుందని పిటిషన్‌లో సర్కార్ పేర్కొంది.