Leading News Portal in Telugu

PM Modi: సీజేఐకి న్యాయవాదుల లేఖపై స్పందించిన పీఎం మోడీ.. కాంగ్రెస్‌పై ఆగ్రహం..



Pm Modi

PM Modi: రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇతరులను బెదిరించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి. ఐదు దశాబ్ధాల క్రితం వారు న్యాయవ్యవస్థ నిబద్ధత కోసం పిలుపునిచ్చారు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరుకుంటారు, కానీ దేశం పట్ల నిబద్ధతకు దూరంగా ఉంటారు.’’ అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదని అన్నారు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా తాజా వ్యాఖ్యలు.. జోక్యం తగదన్న భారత్..

హరీష్ సాల్వే, బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మనన్ కుమార్ మిశ్రా సహా 600 మందికి పైగా న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి కేసుల్లో ‘‘స్వార్థ ప్రయోజనాల సమూహం’’ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, కోర్టుల పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిన్న ఆల్ మణిపూర్ బార్ అసోసియేషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ న్యాయవ్యవస్థపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. రాజకీయ ఎజెండాలతో న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేసేందుకు స్వార్థప్రయోజనాల గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల పోకడలపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని లేఖలో బార్ అసోసియేషన్ పేర్కొంది.