Leading News Portal in Telugu

Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు..



Bjp

Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీలోకి కాంగ్రెస్ వలసలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అస్సాంలోని కీలక కాంగ్రెస్ నేతలు ముగ్గురు కాషాయ కండువా కప్పుకున్నారు. అస్సాం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు నేతలు ఈ రోజు కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు.

అస్సా పీసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి మనష్ బోరా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి తన రాజీనామా లేఖ పంపారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPCC) అస్సాం అధ్యక్షుడు గౌరవ్ సోమాని కూడా శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జోర్హాట్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరవ్‌ గొగోయ్‌కు సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు యువ నేతలు రాజీనామా చేయడం విశేషం. వీరితో పాటు చరైడీవో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకుడు అనూజ్ బర్కటాకీ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు.

Read Also: Pawan Kalyan: దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా..

బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భజేష్ కలితా, కేబినెట్ మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లబరువా, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మనష్ బోరా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వం తనను పార్టీ వైపు ఆకర్షించిందని అన్నారు. కాంగ్రెస్‌కి క్షేత్రస్థాయిలో సంబంధాలు లేకుండా పోయాయని, కొద్ది మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కిషోర్‌ భట్టాచార్య కూడా పార్టీని వీడారని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు ఇలా కాంగ్రెస్ కీలక నేతలు బీజేపీలో చేరుతున్నారు.