
కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వస్తోన్న ఐటీ నోటీసులు దేశ వ్యాప్తంగా మిగిలిన రాజకీయ పార్టీలకు ఓ హెచ్చరిక అని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న వేళ ఐటీ శాఖ నోటీసుల పేరుతో కాంగ్రెస్‌కు నోటీసుల మీద నోటీసులు ఇస్తోంది. శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలు పేరిట రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ డిమాండ్ నోటీసులు ఇచ్చింది. అనంతరం మరో రెండు నోటీసులు ఇచ్చినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ నోటీసుల సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ చిదంబరం హెచ్చరించారు.
దేశంలో ఇతరు పార్టీలను నిర్వీర్యం చేయడమే బీజేపీ లక్ష్యమని చిదంబరం ఆరోపించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కూడా ఇదే ఉద్దేశంలో భాగమని ఆయన చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇతరు పార్టీలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: T20 World Cup: టీ20 వరల్డ్ కప్కు టీమిండియా ప్రకటన అప్పుడే..!
కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం నుంచి వరుసగా నోటీసులు వస్తున్నాయి. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆ వెంటనే ఆయా మదింపు సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీ వసూలు నిమిత్తం హస్తం పార్టీకి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు అందాయి. అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్నుశాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది.
ఇది కూడా చదవండి: LSG vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..
ఇదిలా ఉంటే కేంద్రం అనుసరిస్తున్న పోకడలను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి మహా ర్యాలీకి సిద్ధపడింది. ఈ ర్యాలీలో కూటమిలో ఉన్న పార్టీ నేతలంతా హాజరుకానున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అంశం, ఐటీ నోటీసులపై నేతలు ధ్వజమెత్తనున్నారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం