
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్‌తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన భర్త సింహమని, చాలా కాలం ఆయనను జైలులో ఉంచలేరని ఆమె అన్నారు.
Read Also: MK Stalin: బీజేపీలో 261 మంది రౌడీలు ఉన్నారు.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..
ఇండియా కూటమి నేతృత్వంలో జరిగిన ఆ కార్యక్రమానికి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ నా భర్తను జైల్లో ఉంచలేరని, ప్రధాని చేసింది సరైనదా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని చెప్పారు. తాను ఈ రోజు ఓట్లు అడగం లేదని, నేను 140 కోట్ల మంది భారతీయులను కొత్త భారతదేశాన్ని తయారు చేయడానికి ఆహ్వానిస్తున్నాని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమికి ఒక అవకాశం ఇస్తే, తాము న్యూ ఇండియాను నిర్మిస్తామని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రజలకు ఆప్ 6 హామీలను ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు నిర్వహించిన ర్యాలీపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. తమ పాత నేరాలను దాచడానికి ఈ పార్టీలన్నీ రాంలీలా మైదాన్‌ని ఉపయోగించుకున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రామ్ లీలా మైదానంలో అవినీతిపరుల ముఠా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌ని ఈ వ్యక్తులంతా అవినీతిపరులని పిలిచి, అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాలీ నిర్వహించడంలో ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే అవినీతిలో కూరుకుపోయిన వారు, ప్రజా ధనాన్ని దోచుకుని జైలుకు వెళ్లిన వారు నిజాయితీ ముసుగులో కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.