
Summer Heatwave: ఈ ఏడాది వేసవి మరింత హాట్‌గా ఉండబోతున్నట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సోమవారం తెలిపింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల నిర్వహణకు దేశం సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఎండలు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల తీవ్ర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. బెంగళూర్, హైదరాబాద్ వంటి నగరాలతో సహా అనేక నగరాల్లో ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సాగు చేస్తున్న గోధుమలతో పాటు ఇతర పంటలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పింది.
Read Also: Jaishankar: నెహ్రూ భారత్‌ని కాదని చైనాకు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించారు.. పటేల్ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..
వేసవి వేడితో ఎలా వ్యవహరించాలనే సలహాలను రాష్ట్రాలకు జారీ చేసినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సెక్రటరీ మెంబర్ కమల్ కిషోర్ చెప్పారు. ర్యాలీలు లేదా పెద్ద రాజకీయ సమావేశాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. తూర్పు, ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో మూడు నెలల వ్యవధిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి ఏప్రిల్ నెలలోనే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
రాయలసీమ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, మధ్య మహరాష్ట్ర మీదుగా కొన్ని ప్రదేశాల్లో 40-42 డిగ్రీ సెల్సియస్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్య మహారాస్ట్రలో చాలా చోట్ల కనిష్ణ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 3-5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినోనే ప్రధాన కారణం:
వాతావరణ నిపుణులు మాత్రం ఎల్ నినో ప్రభావం కారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినోగా అభివర్ణిస్తుంటారు. ఈ పరిణామం రుతుపవనాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో ఇప్పటి వరకు నమోదైన బలమైన వాటిలో ఒకటి. ఎల్ నినో సగటున ప్రతీ రెండు నుంచి 7 ఏళ్లకు సంభవిస్తుంటుంది. సాధారణంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ఉంటుంది.