Leading News Portal in Telugu

Man Risks Life: 100 కి.మీ వేగం, తలపై 11,000 వోల్టుల కరెంట్.. రైలుపై ప్రయాణించి బతికిపోయాడు..



Train

Man Risks Life: సాధారణంగా సినిమాల్లోనే రైలు టాప్‌పై ప్రయాణించడం చూస్తాం. నిజజీవితంలో గంటకు 100 కి.మీ వేగంతో వెళ్లే రైలుపై ప్రయాణించడమంటే మృత్యువుని స్వయంగా ఆహ్వానించడమే అవుతుంది. అయితే, 30 ఏళ్ల వ్యక్తి మాత్రం ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ వెళ్లే రైలుపై పడుకుని ప్రయాణించాడు. తలపై 11,000 వోల్టుల విద్యుత్ తీగలు, 100 కి.మీ వేగంలో కూడా అతను ప్రాణాలతో ఉండటం రైల్వే అధికారుల్ని ఆశ్చర్యపరిచింది.

Read Also: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..

ఢిల్లీ-గోరఖ్‌పూర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఓ వ్యక్తి ఉన్నట్లు రైల్వే పోలీసులు కాన్పూర్‌లో గుర్తించి అతడిని కిందికి దించారు. అతడు ఉన్న చోటు నుంచి 5 అడుగుల ఎత్తులో భారీ విద్యుత్‌ ప్రవహించే లైన్ ఉన్నప్పటికీ అతడు తప్పించుకోగలిగాడు. తొలుత సదరు వ్యక్తి చనిపోయాడని భావించిన అధికారులు అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో, విద్యుత్ కట్ చేయించి రైల్వే పోలీసులు ట్రైన్ పైకి ఎక్కి అతడిని కిందకు దించారు. ప్రస్తుతం అతడిని అధికారులు అరెస్ట్ చేశారు.

ఫతేపూర్‌లోని బింద్‌కి తాహసీల్‌ లోని ఫిరోజ్ పూర్ గ్రామానికి చెందిన దిలీప్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైలు పైకప్పుపై ఎందుకు ప్రయాణించావు? అని ప్రశ్నిస్తే ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. కాన్పూర్ ఆర్‌పిఎఫ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బిపి సింగ్ మాట్లాడుతూ.. సదరు వ్యక్తి ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు రైలు పైకప్పుపై ప్రయాణించాడు. అతను మధ్యలో ఎక్కడ నిలబడ్డా కూడా పైన ఉన్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ తగిలి ప్రాణాలు కోల్పోయే వాడని, రైలుకు కూడా ప్రమాదం సంభవించేదని చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి రైల్వే చట్టంలోని సెక్షన్ 156 కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.