Leading News Portal in Telugu

Congress: సంజయ్ నిరుపమ్‌ని బహిష్కరించనున్న కాంగ్రెస్.. ఠాక్రేపై వ్యాఖ్యలే కారణం..



Sanjay Nirupam

Congress: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌ని బహిష్కరించేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇండియా కూటమిపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదనల్ని హైకమాండ్‌కి పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ల లిస్టు నుంచి ఇప్పటికే నిరుపమ్‌ని తొలగించింది. అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఇటీవల మహా కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. మాజీ ఎంపీ అయిన నిరుపమ్, ఉద్ధవ్ ఠాక్రే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్‌లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..

వివాదం ఏమిటి.?

ముంబాయ్ నార్త్-వెస్ట్ సీటు నుంచి నిరుపమ్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అమోల్ కీర్తికర్‌ని ఆ స్థానంలో నిలబెట్టారు. 2019లో శివసేన నేత గజానన్ కీర్తీకర్ చేతిలో నిరుపమ్ ఓడిపోయారు. ప్రస్తుతం గజానన్ ఏక్ నాథ్ షిండే పక్షాన ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఏక్‌నాథ్ షిండే ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి నిరుపమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏ సీటును గెలుచుకోలేదని అన్నారు. కోవిడ్ సమయంలో ఖిడ్డీ స్కామ్‌లో వలస కార్మికులకు ఉచిత ఆహారం అందిచే కార్యక్రమంలో అమోల్ కీర్తికర్ లంచాలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే నిరుపమ్ పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే నిరుపమ్ మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా నిరుపమ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.