
Prashant Kishor: బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్న దక్షిణాది అడ్డంకి ఈ సారి ఎన్నికల్లో అధిగమిస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందని ఆయన అన్నారు. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాషాయ పార్టీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుతుందని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేసులో ఉంటుందని అని జోస్యం చెప్పారు. ఒడిశాలో ఖచ్చితంగా నంబర్ వన్ అవుతుందని, పశ్చిమబెంగాల్‌లో బీజేపీ టీఎంసీ కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు.
అయితే, మొత్తం 540 స్థానాలున్న లోక్‌సభలో బీజేపీ 370 సీట్లు సాధించే అవకాశం లేదని, 300కు మించి సీట్లు సాధించొచ్చని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్‌లతో బీజేపీ 50 సీట్లను కూడా సాధించలేకపోయిందని, ఆపార్టీ 2014లో ఈ రాష్ట్రాల్లో 29 సీట్లు, 2019లో 47 స్థానాలను గెలిచిందని గుర్తు చేశారు.
Read Also: Ex MLA Shakeel Son Arrest: షకీల్ కుమారుడు రహిల్ అరెస్ట్.. ఈనెల 22 వరకు రిమాండ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జగన్ మోహన్ రెడ్డి రావడం కష్టమే అని అన్నారు. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు, పశ్చిమ భారతదేశంలో బీజేపీ తన సత్తా చాటుతుందని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో కనీసం 100 స్థానాలు కోల్పోయేలా చేస్తేనే కాంగ్రెస్‌కి అవకాశాలు ఉంటాయని, అయితే, అది ప్రస్తుతం కుదరదని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు పర్యటనలను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పర్యటనలతో పోల్చారు. మీ పోరాటం ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటే మీరు మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తే ఎలా విజయం సాధిస్తారు.? అని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.
బీజేపీని ఆపడానికి వ్యూహాలు ఉన్నప్పటికీ, సోమరితనం వల్ల ప్రతిపక్షాలు నాశనం చేసుకున్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైతే రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుని, విశ్రాంతి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహాల్లో లోపాలు ఉన్నాయని నిందించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ సొంత గడ్డపై ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్లే బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పారు.