Leading News Portal in Telugu

Birender Singh: కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బీరేందర్ సింగ్



Ne

సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి షాకిచ్చారు. కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో బీరేందర్ సింగ్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయన భార్య ప్రేమ్‌లత కూడా కాంగ్రెస్‌లో చేరారు.

నెలరోజుల క్రితమే బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ లోక్‌సభకు రాజీనామా చేసి.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీరేందర్ సింగ్ భార్య ప్రేమ్‌లత సైతం బీజేపీకి రాజీనామా చేశారు.

బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు బీరేందర్ సింగ్ సోమవారం ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు తెలిపారు. 2014-2019 వరకూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రేమ్ లత సైతం పార్టీని వీడారని చెప్పారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో సంబంధాలు సాగించిన బీరేందర్ సింగ్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు.

ఇది కూడా చదవండి: Ramesh Kumar Reddy Resigns: టీడీపీకి మరో షాక్‌.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

బీరేందర్, బ్రిజేందర్ సింగ్‌లు గతంలోనూ పలు అంశాల్లో బీజేపీతో విభేదించారు. 2020లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేసిన డిమాండ్‌కు వీరు మద్దతు పలికారు. లైంగింక వేధింపులు ఎదుర్కొన్న మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనకు సైతం మద్దతు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!

ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. కాగా హర్యానా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 25న జరుగనున్నాయి.

ఇది కూడా చదవండి: MLC Kavitha: లిక్కర్ కేసులో బాధితురాలిని.. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ