Leading News Portal in Telugu

Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..



Modi, Raj Thackeray

Raj Thackeray: ప్రధాని నరేంద్రమోడీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా అయోధ్యంలో రామమందిర నిర్మాణం జరగకపోయేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే శనివారం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీకి, బీజేపీకి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సమన్వయం కోసం మహాయుతి కూటమి(శివసేన-బీజేపీ-ఎన్సీపీ)తో సంప్రదింపులు జరిపే నాయకుల జాబితాను ఎంఎన్ఎస్ సిద్ధం చేస్తుందని ఆయన చెప్పారు. ఎంఎన్ఎస్ నాయకులు కూటమి మద్దతు ఉన్న అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొంటారని, వారి తరుపున ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు.

Read Also: Dhanush: హీరో ధనుష్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి!

48 మంది ఎంపీలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 మధ్య ఐదు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నరేంద్రమోడీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా రామమందిరం నిర్మించబడేది కాదని, ఇది పెండింగ్ సమస్యగా మిగిలిపోయేదని థాకరే అన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత రామమందిర నిర్మాణం పెండింగ్‌లో ఉందని ఠాక్రే చెప్పుకొచ్చారు. ‘‘కొన్ని విషయాలను ప్రశింసించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అసమర్థ నాయకత్వం, మరోవైపు బలమైన నాయకత్వం ఉంది. కాబట్టి మేము నరేంద్రమోడీకి మద్దతు ఇవ్వాలని భావించాము’’ అని రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శించడంపై రాజ్ ఠాక్రే స్పందిస్తూ.. వారికి కామెర్లు ఉన్నాయని అన్నారు. మహారాష్ట్రలో తమకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని, మరాఠీకి శాస్త్రీయ భాషా హోదా కల్పించడంతో పాటు రాష్ట్రంలో కోటల్ని పునరుద్ధిరించాలని కోరారు. ప్రధాని మోడీ గుజరాత్ నుంచి వచ్చినందుకు ఆయనకు ఆ రాష్ట్రం అంటే ఇష్టమని, అదే విధంగా ఇతర రాష్ట్రాలపై కూడా దృష్టిసారించాలని రాజ్ ఠాక్రే కోరారు.