Leading News Portal in Telugu

Salman khan: కాల్పుల కేసులో కీలక పరిణామం.. పోలీస్ కస్టడీకి నిందితులు



Salman Khan

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఆదివారం కాల్పుల అనంతరం నిందితులిద్దరూ ముంబై నుంచి గుజరాత్‌కు పారిపోయారు. సోమవారం రాత్రి గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ శ్రీజోగేంద్ర పాల్ (21)లను ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ముంబైలోని కిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఘటనపై తదుపరి విచారణ నిమిత్తం ఇద్దరు నిందితులకు ఏప్రిల్ 25 వరకు 9 రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు 14 రోజులు కస్టడీ కోరగా.. 9 రోజులు కస్టడీకి అంగీకరించింది.

ఇది కూడా చదవండి: Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోని ఫిదా చేసిన ప్రశాంత్ వర్మ

పోలీస్ కస్టడీలో సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు?, కాల్పులకు అసలు కారణమేంటో తెలుసుకోనున్నారు. ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు నవీ ముంబై పన్వెల్‌లోని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్‌ ఉంది. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పాత యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. ద్విచక్ర వాహనం పాత యజమానిది కూడా పన్వెల్‌ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చదవండి: T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి

ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ దగ్గరకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డారు. బాల్కనీలో పడ్డ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సల్మాన్‌ఖాన్‌ను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బీహార్‌కు చెందిన వారు కావడంతో అక్కడికి కూడా పోలీసులను పంపించారు. కారణాలు తెలుసుకునేందుకు నిందితుల కుటుంబ సభ్యుల్ని కూడా విచారించనున్నారు.

ఇది కూడా చదవండి: UPSC CSE Result 2023: UPSC టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ‌ ఎవరు..? ఎక్కడ విద్యను అభ్యసించారు