
Lok Sabha Elections 2024: ఎన్నికల పండగకు దేశమంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 16.63 కోట్ల మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకుని 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల సంఘం 18 లక్షల మంది పోలింగ్ అధికారులను మోహరించింది. శాంతియుతంగా ఎన్నికలు జరగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ మామిడి పండ్లు తినడంపై స్పందించి ఆప్.. చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ..
ఎన్ని స్థానాలు, ఎంత మంది ఓటర్లు:
తొలి విడత ఎన్నికలు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లతో పాటు 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 20-29 ఏళ్ల మధ్యలో 3.51 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లను, 84 ప్రత్యేక రైళ్లను, దాదాపుగా లక్ష వాహనాలను పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల ఏర్పాటుతో పాటు 50 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. మొత్తం 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2,028 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు మరియు 1,255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు ఓటర్లను ఏ విధంగా ప్రేరేపించకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, టాయిలెట్లు, ర్యాంప్‌లు, వాలంటీర్లు, వీల్ చైర్లు వంటి సౌకర్యాలను కల్పించారు. 5000కి పైగా పోలింగ్ స్టేషన్లను పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారు. ECI పోలింగ్ స్టేషన్‌లలో గుర్తింపు ధృవీకరణ కోసం ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ (EPIC) కాకుండా 12 ప్రత్యామ్నాయ పత్రాలను కూడా అందించింది.