Leading News Portal in Telugu

BrahMos: ఫిలిప్పీన్స్‌కి భారత బ్రహ్మోస్ క్షిపణులు.. రేపటి నుంచి సరఫరా..



Brahmos

BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది. మొదటి విడత బ్యాచ్‌ని శుక్రవారం డెలివరీ చేయనుంది. రక్షణ రంగంలో ఎగుమతులను పెంచుకునే భారత లక్ష్యంలో ఇది కీలక మైలురాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనాను అడ్డుకునేందుకు బ్రహ్మోస్ క్షిపణులు అవసరమని ఫిలిప్పీన్స్ భావిస్తోంది.

ఫిలిప్పీన్స్‌లోని పంపంగా ప్రావిన్స్‌లోని క్లార్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత వైమానిక దళం (IAF)కి చెందిన రెండు విమానాలు, కార్గో విమానాల ద్వారా డెలివరీ జరుగుతుందని రక్షణ, భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపాయి. క్షిపణి వ్యవస్థలో భాగంగా లాంచర్లు, వాహనాలు, లోడర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సహా అనేక ఉప వ్యవస్థలు ఇందులో భాగంగా ఉంటాయి.

Read Also: Karnataka: ప్రేమించడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణహత్య..

జనవరి 2022లో 374.96 మిలియన్ల ఒప్పందాన్ని ఫిలిప్పీన్స్, భారత్‌తో కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ ఆ దేశానికి చెందిన ఒక దీవిలో స్టోరేజ్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భారత రక్షణ రంగానికి సంబంధించి ఇదే మొదటి అతిపెద్ద అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందం. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేస్తున్న బ్రహ్మోస్ పరిధి 290 కి.మీ. ప్రస్తుతం భారత్ సుదూర క్షిపణులను కలిగి ఉండగా.. ఫిలిప్పీన్స్‌కి డెలివరీ చేసేది షార్ట్ వెర్షన్.

ఫిలిప్పీన్స్-చైనా మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ డెలివరీ జరుగుతోంది. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఫిలప్పీన్స్ వెళ్లి ఆ దేశానికి సంఘీభావం ప్రకటించారు. స్కార్‌బరో షోల్ మరియు స్ప్రాట్లీ దీవులు, ఫిలిప్పీన్స్ మరియు చైనాల మధ్య గత రెండు సంవత్సరాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. బ్రహ్మోస్ ఇండియా-రష్యా జాయింట్ వెంచర్. ఈ క్షిపణి ధ్వని కన్నా మూడు రెట్ల(మాక్ 2.8) వేగంతో దూసుకెళ్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏకైక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ మాత్రమే. ఇది కోస్టల్ డిఫెన్స్, గ్రౌండ్ అటాక్ రోల్స్ రెండిండిని నిర్వహించగలదు.