
Bulldozer action: మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో ఇటీవల ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్ర శారీరక హింసకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుపైకి మార్చనందుకు అయాన్ పఠాన్ అనే నిందితుడు యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా యువతిని బెల్టు, పైపుతో కొట్టిడమే కాకుండా, గాయాలు, కళ్లలో కారం పోశాడు. యువతి అరవకుండా పెదాలను ఫెవిక్విక్‌తో మూశాడు. అతికష్టం మీద అతడి నుంచి తప్పించుకున్న యువతి ప్రాణాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది.
Read Also: Rajnath Singh: “సందేశ్‌ఖాలీ” లాంటి అఘాయిత్యాలకు ఎవరు ధైర్యం చేస్తారో చూస్తాం..
అయితే, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ రోజు స్థానిక పరిపాలన అధికారులు బుల్డోజర్‌తో నిందితుడి ఇంటికి వచ్చి కూల్చివేత నోటీసులు అంటించారు. అతడిపై బుల్డోజర్ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కొరకు నేరస్థలానికి తీసుకువచ్చారు. దాడికి ఉపయోగించిన బెల్ట్, ఫెవిక్విక్ ట్యూబ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అతడిని చూసి స్థానికులు భయపడేవారని, తరుచూ గొడవలు పెట్టుకునే వాడని అక్కడి ప్రజలు చెప్పారు.
ఇదిలా ఉంటే తీవ్ర గాయాలపాలైన బాధితురాలని గ్వాలియర్ ఆస్పత్రి నుంచి ఢిల్లీకి తరలించారు. ఒళ్లంతా గాయాలతో ఆమె శరీరం వాచిపోయింది. వాపు కారణంగా ఆమె కళ్లు మూసుకుపోయాయి. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి అధికారులు తరలించారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చేయబోతున్నారు. నిందితుడితో పాటు అతని సోదరుడు రోజూ కూలీ పనిచేసుకుంటారని స్థానికులు వెల్లడించారు.