
Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన సొంత గడ్డ కర్ణాటకలోని కలబురిగితో భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ప్రజలు తమ పార్టీకి ఓటేయడానికి ఇష్టపడకపోయినా, ప్రజల కోసం పనిచేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలి’’ అని ప్రజలను బుధవారం కోరారు. కలబురిగి నుంచి ఖర్గే అల్లుడు కాంగ్రెస్ నుంచి బరిలో పోటీ చేస్తున్నారు. జిల్లాలోని అఫ్జల్ పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే కలబురిగిలో తనకు స్థానం లేదని భావిస్తానని ఆయన అన్నారు.
Read Also: PM Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా తగ్గించి మత రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ యత్నం..
కలబురిగిలో గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ఆ పార్టీ ఎంపీ ఉమేష్ జాదవ్‌పై కాంగ్రెస్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలోకి దింపింది. ‘‘ఈసారి కాంగ్రెస్‌కి ఓటేయకుంటే తనకు ఇక్కడ స్థానం లేదని అనుకుంటా, మీ హృదయాలను గెలవలేదని అనుకుంటా’’ అని ఖర్గే అన్నారు. 2009, 2014లో కలబురిగి నుంచి గెలిచిన ఖర్గే, 2019లో మాత్రం ఓడిపోయారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన తుది శ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.
‘‘నేను రాజకీయాల కోసమే పుట్టానని. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకున్నా ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోను’’ అని ఖర్గే స్పష్టం చేశారు. తాను ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఓడించేందు పుట్టాను కానీ, వారికి లొంగిపోయేందుకు కాదని అన్నారు. ఇదే విషయాన్ని సీఎం సిద్ధరామయ్యకు చెప్పానని ఖర్గే అన్నారు.