
S Jaishankar: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవల భారత్‌తో పాటు పలు దేశాలను ఉద్దేశిస్తూ ‘‘జెనోఫోబిక్’’(ఇతరులపై విద్వేషం) వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు ఇలా ప్రవర్తిస్తాయని అన్నారు. అయితే, ఈ వాఖ్యలు వివాదాస్పదం కావడంతో బైడెన్ యంత్రాంగం దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. ఇదిలా ఉంటే బైడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. బైడెన్ వ్యాఖ్యల్ని తిరస్కరించారు. ఎకనామిక్స్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన భారత్ ఎప్పుడు ఓపెన్‌గా ఉంటుందని, విభిన్న సమాజాల ప్రజలకు స్వాగతం పలుకుతుందని అన్నారు.
జోబైడెన్ మాట్లాడుతూ.. అమెరికా అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, బాగా లేదని ఆరోపించారు. ఈ వాఖ్యల్ని ఖండించిన జైశంకర్, మొదటగా మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడదని అన్నారు. కొన్ని ఏళ్లుగా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, గత ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము, భారత్ ఈ దశాబ్ధం ముగిసే లోపే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
Read Also: T20 World Cup 2024: రోహిత్, ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు: గంగూలీ
మే 2న ప్రెసిడెంట్ బైడెన్ మాట్లాడుతూ.. ‘‘మీకు తెలుసా, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వలసదారుల్ని స్వాగతించడం కారణం, చైనా ఎందుకు ఆర్థికంగా స్తంభిస్తోంది..? జపాన్ ఎందుకు ఇబ్బందుల్లో ఉంది..? రష్యా, ఇండియాల పరిస్థితి ఏమిటి..? వాళ్లంతా ఇతర దేశస్థులు, తెలియనివారి పట్ల విద్వేషంతో(జెనోఫోబిక్)గా ఉంటారు. వాళ్లు వలసదారుల్ని ఆహ్వానించారు’’ అని అన్నారు.
దీనిపై జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడూ ప్రత్యేకమైన దేశం, వాస్తవానికి ప్రపంచ చరిత్రలో ఇది చాలా ఓపెన్‌గా ఉండే సమాజం, వివిధ సమజాల నుంచి వేర్వేరు వ్యక్తులు భారత్‌కి వస్తుంటారు. ఇందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మంచి ఉదాహరణ అని అన్నారు. సీఏఏ ఇతర దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తలుపులు తెరిచింది. మరోవైపు అమెరికా యూనివర్సిటీల్లో ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలను పాశ్చాత్య మీడియా పక్షపాతంగా కవరేజ్ చేస్తుందని, ఈ మీడియా ప్రపంచ కథనాన్ని రూపొందించాలని కోరుకుంటోందని, భారతదేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన అన్నారు.
అయితే, బెడెన్ వ్యాఖ్యలను సరిదిద్దేందుకు ఆయన యంత్రాంగం పనిచేస్తోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరీ, అధ్యక్షుడి వ్యాఖ్యలు అమెరికా వలస వారసత్వం నుంచి వచ్చిన లాభాలను నొక్కి చెప్పారని అన్నారు. భారతదేశం మరియు జపాన్ వంటి దేశాలతో దౌత్య సంబంధాలను పెంపొందించడంపై బిడెన్ దృష్టి ఉందని, గత మూడు సంవత్సరాలలో ఆయన తీసుకున్న చర్యలు దీనిని ప్రతిబింబిస్తాయని ఆమె నొక్కి చెప్పారు.