Leading News Portal in Telugu

HD Revanna: సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం.. మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్..



Hd Revanna

HD Revanna: సెక్స్ కుంభకోణం కేసులు కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి జేడీయూ నేత, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసు నమోదైంది. తాజాగా కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను దేవెగౌడ నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతని అరెస్ట్‌కు వ్యతిరేఖంగా రక్షణ కల్పించాలనే పిటిషన్‌ని తిరస్కరించిన తర్వాత అరెస్ట్ జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో ఏర్పాటు చేసిన సిట్ రేవణ్ణను అరెస్ట్ చేసింది.

Read Also: Budi Mutyala Naidu vs Budi Ravi: రచ్చకెక్కిన తండ్రీకొడుకులు.. డిప్యూటీ సీఎం సొంతూరు తారువలో ఉద్రిక్తత

తన తల్లిని రేవణ్ణ, అతని సహాయకుడు కిడ్నాప్ చేశారని 20 ఏళ్ల యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రాజు అనే యువకుడి ఫిర్యాదు మేరకు రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. సెక్షన్ 364A (కిడ్నాప్) మరియు సెక్షన్ 365 (బలవంతంగా నిర్బంధించడం) కింద కేసు నమోదు చేయబడింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. కిడ్నాప్‌ కేసులో రేవణ్ణ బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది. సదరు మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న సతీష్ ఆమెను రేవణ్ణ పిలుస్తున్నాడని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఏప్రిల్ 29న ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధిత మహిళ కుమారుడు తన తల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది.

ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం పెద్దగా మారడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ వీడియోలు బయటపడటంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి వెళ్లాడు. అతడిపై కర్ణాటక ప్రభుత్వం రెండు సార్లు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.