Leading News Portal in Telugu

Congress: జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్, ప్రియాంకా వర్గాలుగా విడిపోతుంది..



Rahul, Priyanka

Congress: జూన్ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా ముక్కలవుతుందని మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంకా గాంధీ వర్గంగా చీలిపోతుందని అన్నారు. రాహుల్ గాంధీ పారిపోయే నేత అని, అందుకే అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరిణామం తర్వాత దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తల మనోబలం తగ్గిపోయిందని అన్నారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, మెల్లిమెల్లిగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీ నేతల్లో అగ్నిపర్వతం రగులుతోందని ఇది జూన్ 4 తర్వాత బద్ధలవుతుందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్-రాహుల్, కాంగ్రెస్-ప్రియాంకాగా పార్టీ విడిపోతుందని చెప్పారు.

Read Also: Tamilisai: నాకు, ప్రజలకు మధ్య గ్యాప్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ నేతలే.. తమిళిసై కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై ప్రశ్నించగా.. ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ కంటే పాకిస్తాన్ లోని రావల్పిండి నుంచి పోటీ చేయడం మంచిదని, పాకిస్తాన్‌లో అతని క్రేజ్, డిమాండ్ ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, నిన్న రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. గత కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే అయేథీ నుంచి ఓడిపోయి వయనాడ్‌కి వెళ్లాడని, వయనాడ్ లో ఓడిపోతానని తెలిసి రాయ్‌బరేలీకి వచ్చాడని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన రాయ్‌బరేలీలో కూడా భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న అయేథీ, రాయ్‌బరేలీ నుంచి కిషోరీ లాల్ శర్మ, రాహుల్ గాంధీలు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాలకు 5వ దశలో మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి.