Leading News Portal in Telugu

Weather Update: సౌతిండియాకు ఐఎండీ గుడ్‌న్యూస్.. ఈ రాష్ట్రాలకు వర్ష సూచన



Raeei

దక్షిణ భారత్‌కు కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గుడ్‌న్యూస్ చెప్పింది. వేడి గాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చని పేర్కొంది.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత్‌లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయించిన దగ్గర నుంచి నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: AP Jobs : ఏపీలో భారీగా ఉద్యోగాలు .. నెలకు రూ.70,000 జీతం..

మే 7 నుంచి దక్షిణ భారత్‌లో వేడిగాలుల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది. తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. మరాఠ్వాడా మీదుగా తుఫాను ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పింది. ద్రోణి ప్రభావం కారణంగా హీట్‌వేవ్ పరిస్థితులు తగ్గుముఖం పడతాయని సోమవారం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచే చల్లని వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. ఇక మే 10 వరకు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: iQoo Z9x 5G: బడ్జెట్ ఫోన్స్ లో అదిరిపోయే ఫీచర్లతో రానున్న ఐక్యూ Z9x 5జీ ఫోన్..

అలాగే రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో వేడి తీవ్రత తగ్గుతుందని చెప్పింది. మే 7 వరకు ఈశాన్య భారతదేశంలో కూడా ఉరుములు, గాలులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్సుందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ద్రోణి కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణ, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక మే 08 – 12 మధ్యకాలంలో కేరళ, మహే, లక్షద్వీప్‌ల మీదుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

ఇదిలా ఉంటే తెలంగాణలో మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కొద్ది రోజులుగా వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలు.. తాజా వాతావరణంతో ఊపిరిపీల్చుకుంటున్నారు.