
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
విడాకుల వివాదంతో హత్య
ఈ ఘటన బుధవారం రాత్రి కుల్తానా గ్రామంలో చోటుచేసుకుందని పలి రూరల్ డీఎస్పీ రత్నారామ్ దేవాసి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. విడాకుల వివాదం కారణంగా ప్రకాష్ పటేల్ (30) తన తండ్రి దుర్గారం పటేల్ (65)ని గొంతు కోసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
కొడుకుతో కలిసి ఆత్మహత్య
తండ్రిని హత్య చేసిన తర్వాత ప్రకాష్ తన కుమారుడు రాహుల్‌తో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం వారి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.