
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులకు కెనడా ఆశ్రయం ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు, హింసను సమర్థించేవారికి ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు, వారు విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. భారత్‌తో సంబంధం ఉన్న వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కెనడా ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ దేశానికి తెలియజేశామని చెప్పారు. వారిని అప్పగించాలనే భారత్ అభ్యర్థనలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాలపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై ప్రశ్నించగా.. భారత విదేశాంగ అధికారికంగా ఎలాంటి కమ్యూనికేషన్ జరపలేదని అన్నారు. ఈ రోజు వరకు కెనడియన్ అధికారుల నుంచి ఎలాంటి నిర్ధిష్ట ఆధారాలు, సమాచారం అందలేదని, కెనడా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన జైశ్వాల్ చెప్పారు.
కెనడా ఉగ్రవాదులకు స్థావరంగా మారుతోందని భారత్ విమర్శించడం ఇదే మొదటిసారి కారు. గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తుతెలియని వ్యక్తులు సర్రేలో కాల్చి చంపారు. ఆ సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని భారత్ తిరస్కరించింది, ఇది రాజకీయ ప్రేరేపిత అసంబద్ద వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా తన దేశాన్ని ఉగ్రవాదులకు స్థావరంగా మారుస్తోందని భారత్ మండిపడింది.