Leading News Portal in Telugu

Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..


Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఈ రోజు సాయంత్రం విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకోవడానికి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఇండియా కూటమి నేతలు, ఆప్ నేతలు జైలు వద్ద గుమిగూడారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ తివారీలతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్‌కి స్వాగతం పలికారు.


తనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకి, న్యాయమూర్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల్ని నియంతృత్వ పాలన నుంచి బయటపడేయడానికి పోరాడాల్సి ఉందని అన్నారు. సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల వల్లే తాను మీ ముందర ఉండగలిగానని వ్యాఖ్యానించారు. తన విడుదలకు హనుమంతుడు కారణమని, శనివారం ఉదయం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం నినాదాలు చేశారు. ఈ రోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని, తాను త్వరలోనే బయటకు వస్తానని చెప్పాను, వచ్చానని వ్యాఖ్యానించారు.