
ప్రపంచానికి పరిచయం చేయడానికి మన దగ్గర చాలా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కాశీ క్షేత్రానికి పూర్వవైభవం తెచ్చినట్టే.. ఇతర పుణ్యక్షేత్రాల సంస్కరణ సంకల్పం ఉండొచ్చని ఆశించవచ్చా? అని అడిగిన ప్రశ్నకు సుదీర్ఘంగా వివరించారు. ‘‘విషయం ఏంటంటే.. నేను ఏమీ చేయలేదు. చేయడానికి నేను ఎవరిని?, దేవుడి దయ ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రజలు కూడా ఈశ్వరుడి స్వరూపాలే. ప్రజల కోరిక, ఆకాంక్ష బలంగా మారినప్పుడు వాళ్లకు ఒక కొత్త వెలుగు, కొత్త సామర్థ్యం కనిపిస్తుంది. నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే. బహుశా గంగామాత నన్ను ఇందుకే కాశీకి రప్పించి ఉంటుంది. నేను వెళ్లా. నాకు గుజరాత్ అనుభవం ఉంది. టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇతర నమూనాల్ని చూడాల్సిన అవసరం లేదు.’’ అని మోడీ చెప్పారు.
‘‘ఉదాహరణకు జీ20 సదస్సు జరిగింది. 200కు పైగా సమావేశాలయ్యాయి. జీ 20తో సంబంధం ఉన్న కీలక బృందాలు భారత్‌కు వచ్చాయి. ఒక్కో దేశం నుంచి 300 మంది సభ్యులు వచ్చారు. వచ్చిన అతిథులంతా మన దేశంలోని వివిధ ప్రాంతాల్ని చూశారు. వైవిద్యాన్ని చూశారు. ఇక్కడి రంగు, రుచి, వాసనను ఆస్వాదించారు.
అప్పటిదాకా వారికి ఈ అనుభవం తెలియలేదు. 140 కోట్ల భారతీయులకు మార్కెట్ భాషలో చెప్పాలంటే..
ఇది మంచి అవకాశం.. కానీ మనం దానిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మేం అనేక సంస్కరణలు చేశాం. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేశాం.. రైళ్లు నడుస్తున్నాయి. ఉదాహరణకు రాములవారి సర్క్యూట్ ట్రైనే తీసుకోండి.
టికెట్ రేటు ఫిక్స్‌డ్ చేశాం. ఒక్కసారి ఆ రైలు ఎక్కాక.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వృద్ధులకు చాలా సదుపాయాలున్నాయి. వెళ్లాల్సిన చోటు చెబితే వాహన సౌకర్యం ఉంటుంది. దేశంలో టూరిజం వ్యవస్థ చాలా విశాలమైంది. మాకు చాలా ప్రణాళికలున్నాయి.’’ అని మోడీ తెలిపారు.
‘‘మీ ఎన్టీవీ టీమ్ ఒక్కో సర్క్యూట్‌ను కెమెరా తీసుకెళ్లి పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి నేను ఈ విషయం చెబుతాను. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రతీ టూరిజం సర్క్యూట్‌లో వెల్లివిరుస్తున్న భక్తిభావం మీకు కనిపిస్తుంది. వారణాసి ఎంపీగా.. ఆ పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే.. అక్కడికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ఒకసారి మహాత్మగాంధీ కాశీకి వచ్చారు.. అక్కడ అపరిశుభ్రత, సౌకర్యాల లేమిపై అసంతృప్తి చెందారు. గాంధీజీ కాలం నుంచి ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని నా మనసుకు అనిపించింది. గాంధీజీ చెప్పినదాన్ని పరిష్కరించాలని నేను అనుకున్నాను. కాశీ స్వరూపం మార్చాలనుకున్నాను. కాశీలో మౌళిక వసతులు పెంచాం. సదుపాయాలు పెంచాం. కాశీఘాట్‌లో అంతిమ సంస్కారాలు చేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఘాట్‌లో మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు త్వరగా చేసే వ్యవస్థ పెంచాం. ఇలా అనేక వసతులు కల్పించాం. దాని వలన కాశీకొచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.’’ అని మోడీ వెల్లడించారు.
‘‘విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటుకు కాశీవాసులు సహకరించారు. లేదంటే కారిడార్ నిర్మించడం, యాత్రికుల కోసం ఇళ్లు సమీకరించడం కష్టమయ్యేది. ఇప్పటివరకు 15 కోట్ల మంది యాత్రికులు కాశీకి వచ్చారు. ఇంతమంది యాత్రికులు వచ్చినప్పుడు.. మీరే ఊహించండి. కాశీ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి చేరుకుంటుందో.. కాశీ ప్రజలకు ఉపాధి లభిస్తోంది. నావికులకు పని దొరుకుతోంది. పూలమ్మేవారికి, గెస్ట్‌హౌస్‌ల వారికి ఉపాధి దొరుకుతోంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
‘‘2023లో కేధర్‌నాథ్‌కు 20 లక్షల మంది యాత్రికులు వచ్చారు. ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థ కేధార్‌నాథ్ పర్యాటకం పైనే ఆధారపడింది. అదే రాష్ట్రానికి పెద్ద అండ, చార్‌ధామ్‌కు 55 లక్షల మంది యాత్రికులొస్తారు.
ఇదంతా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ఉజ్జయిన్ని ఆలయాన్ని 5 కోట్ల మంది దర్శించుకున్నారు. భక్తులు రాక అక్కడి ఆలయానికి ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది.’’ అని మోడీ చెప్పుకొచ్చారు.