Leading News Portal in Telugu

Mamata Banerjee: సీబీఐకి మమతా అల్టిమేటం.. ఆదివారంలోగా వైద్యురాలికి న్యాయం జరగాలి..


  • వైద్యురాలి అత్యాచార ఘటనపై సీబీఐకి మమతా అల్టిమేటం..

  • ఆదివారంలోగా బాధితురాలికి న్యాయం చేయాలి..

  • ఘటనపై శనివారం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన టీఎంసీ..
Mamata Banerjee: సీబీఐకి మమతా అల్టిమేటం.. ఆదివారంలోగా వైద్యురాలికి న్యాయం జరగాలి..

Mamata Banerjee: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు, ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం బాధితురాలి శరీరంలో గణనీయ స్థాయిలో 150 మిల్లిగ్రాముల వీర్యం దొరకడంతో ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ కేసులో పొలిటికల్ దుమారం చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే, బుధవారం రోజు ఈ కేసుపై సీఎం మమతా స్పందిస్తూ.. బీజేపీ, సీపీఎంలో వైద్యురాలి ఘటనలో చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. కోల్‌కతా పోలీసుల నుంచి విచారణ చేపట్టిన సీబీఐ అధికారులకు ఆమె అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఆదివారం లోగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆగస్టు 16న కోల్‌కతాలోని మౌలాలి నుంచి ధర్మతాలా వరకు బాధితురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాను. వచ్చే ఆదివారం లోగా సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిపై దారుణంగా అత్యాచారం హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను నిందితుడు పాశవికంగా హత్యాచారం చేశాడు. శుక్రవారం ఉదయం కాలేజీ సెమినార్ గదిలో బాధితురాలి మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో పాటు పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. మెడ ఎముక విరిగినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.