Leading News Portal in Telugu

Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్‌కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..


  • ఫడ్నవీస్ అరెస్ట్‌కి అప్పటి ఎంవీఏ ప్రభుత్వం కుట్ర..

  • బీజేపీని అణిచేందుకు ఉద్ధవ్ సర్కార్ ప్లాన్..

  • సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే..
Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్‌కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..

Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.

ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘ వారు ప్రతీది ప్లాన్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. ఇది బీజేపీని వెనుకడుగు వేసేలా చేయొచ్చు. వారి ఎమ్మెల్యేలు ఎంవీఏలో చేరొచ్చు’’ అని షిండే అన్నారు. తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ కుట్రతో ఎంవీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకుందని చెప్పారు. బీజేపీపై ప్రతీకారానికి వారు ఈ మార్గాన్ని సమర్థించారని చెప్పారు.

అర్బన్ ల్యాండ్ కేసులో నన్ను కూడా ఇరికించాలని ప్రయత్నించారని, కొంత మంది అధికారుల నుంచి ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్లాన్ గురించి మొత్తం తెలుసుకున్నానని అన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ వ్యవహారాల్లో తన కుటుంబ సభ్యుల అనవసర జోక్యాన్ని అనుమతించారని షిండే విమర్శించారు. దీని వల్ల ఠాక్రే ప్రవర్తన మరింత అస్థిరంగా మారిందని, అతనికి అయోమయం, విచారం కలిగిందని అన్నారు. పార్టీ పట్ల అంకిత భావం ఉన్నప్పటికీ రాజ్ ఠాక్రేని అన్యాయంగా పక్కన పెట్టేశారని, ఇది బాలా సాహెబ్ ఠాక్రే కోరికకు విరుద్ధంగా ఉందని షిండే చెప్పారు. బాలా సాహెబ్ ఠాక్రే రాజ్ ఠాక్రేని విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.