Leading News Portal in Telugu

Badlapur school sexual abuse: బద్లాపూర్ లైంగిక వేధింపులపై విచారణ చేపట్టిన బాలల హక్కుల సంఘం..


  • బద్లాపూర్​లోని ఓ ప్రైవేట్ స్కూల్​లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్​ లైంగిక వేధింపులు..

  • పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు.. స్థానిక యువత..

  • నేడు బద్లాపూర్ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ..
Badlapur school sexual abuse: బద్లాపూర్ లైంగిక వేధింపులపై విచారణ చేపట్టిన బాలల హక్కుల సంఘం..

Badlapur school sexual abuse: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్​లోని ఓ ప్రైవేట్ స్కూల్​లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్​ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. స్టూడెంట్స్​ తల్లిదండ్రులతో పాటు స్థానికులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్కూల్ టాయిలెట్‌‌‌‌లో నాలుగేండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను స్వీపర్(23) లైంగికంగా వేధించిన విషయం తెలియడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో మరుసటిరోజు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. అయితే, ఈ ఘటనపై మంగళవారం ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి. అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడికి సైతం దిగారు. అందరూ రైలు పట్టాల మీదకి రావడంతో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దోషులను ఉరితీయాలంటూ డిమాండ్​ చేశారు.

అయితే, బద్లాపూర్‌ పట్టణంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో తాత్కాలికంగా నిలిపివేయబడిన తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరించబడింది. నేడు ( బుధవారం) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఈ కేసుపై విచారణ కోసం బద్లాపూర్‌కు బృందాన్ని పంపబోతున్నట్లు పేర్కొనింది. కాగా, జాతీయ బాలల హక్కుల సంఘం నేతలు ఇద్దరు బాలికలను కలిసి అస్సలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీయనున్నారు. దీంతో పాటు నిందితుడిని కూడా వీరు విచారణ చేసే అవకాశం ఉంది.