- రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని ఆందోళనలు..
-
విద్యార్థి సంఘాలను అడ్డుకోవడానికి షేక్ హసీనా కుట్ర చేసింది.. -
భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనాను తమకు అప్పగించాలి: బంగ్లాదేశ్

Bangladesh: భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ భారత్‌ను కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని ఆందోళనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి హసీనాపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్‌పీ వెల్లడించింది.
కాగా, ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్‌పీ వ్యవస్థాపకుడు జియా- ఉర్ రెహమాన్ సమాధి దగ్గర మీర్జా ఫఖ్రుల్ నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలి.. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని అనుకుంటున్నారు.. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవాలి.. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటంతో భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను కలిగి లేదని ఆయన చెప్పుకొచ్చారు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి వెళ్లిపోయింది.. భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రిజైన్ చేసి భారత్ చేరుకుంది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.