- ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
-
నేషనల్ కాన్ఫరెన్స్.. కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు -
ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదు- మెహబూబా ముఫ్తీ -
కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోం- ముఫ్తీ -
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదని.. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని చెప్పారు. “మా మేనిఫెస్టోను ఆమోదించడానికి, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అంగీకరించడానికి ఎన్‌సి.. కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే మేము ఏ స్థానంలోనూ పోరాడకుండా వారికి మద్దతు ఇస్తాము” అని ఆమె తెలిపారు. తమ ఎజెండా జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడమేనని పేర్కొన్నారు.
మేనిఫెస్టోకు సంబంధించి.. నియంత్రణ రేఖ వెంబడి భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని మెహబూబా ముఫ్తీ తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలు కోరుకుంటున్నట్లు మేనిఫెస్టోలో తెలిపిది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని శారదా పీఠానికి మార్గం తెరవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ, కాంట్రాక్టు అధ్యాపకుల గౌరవ వేతనం పెంపు.. పేదలకు సరిపడా బియ్యం, రేషన్.. పేద కుటుంబాలకు ఏడాదిలో 12 సిలిండర్లు అందజేస్తామన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.