Leading News Portal in Telugu

Badlapur Incident: బద్లాపూర్ ఘటనకు సంబంధించి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్..


  • సంచలనంగా మారిన బద్లాపూర్‌ ఘటన

  • బద్లాపూర్ పాఠశాలలో గత 15 రోజులుగా సీసీటీవీ ఫుటేజీ కనిపించడం లేదు- విద్యాశాఖ మంత్రి

  • పాఠశాల అధికారుల ప్రమేయంపై అధికారులు దర్యాప్తు.
Badlapur Incident: బద్లాపూర్ ఘటనకు సంబంధించి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్..

మహారాష్ట్రలోని బద్లాపూర్‌ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య బాలికలపై స్వీపర్ లైంగిక దాడి చేశాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం.. బాలికలిద్దరికీ వైద్యపరీక్షలు చేయించడంతో నిజం బయటకు వచ్చింది.

కాగా.. బద్లాపూర్ పాఠశాలలో గత 15 రోజులుగా సీసీటీవీ ఫుటేజీ కనిపించడం లేదని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ సోమవారం తెలిపారు. ఫుటేజీ ఎలా అదృశ్యమైంది.. పాఠశాల అధికారుల ప్రమేయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం బాధిత బాలికలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అత్యాచారం జరిగితే రూ.10 లక్షలు, లైంగిక వేధింపులకు గురైతే రూ.3 లక్షలు ఇస్తామని కేసర్కర్ తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరి చదువు ఖర్చులు తామే భరిస్తామని.. ఆడపిల్లలిద్దరికీ సాయం చేస్తామని మంత్రి చెప్పారు.

మరోవైపు.. ఈ ఘటనపై బద్లాపూర్‌లో భారీ నిరసనలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి రైలు సేవలకు అంతరాయం కలిగించారు. ఆ తర్వాత పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు అక్షయ్ షిండేను పోలీసులు ఆగస్టు 17న అరెస్టు చేసి కస్టడీకి పంపారు. కాగా.. నిందితుడిని ఎలాంటి తనిఖీలు లేకుండానే పాఠశాల కాంట్రాక్టు వర్కర్‌గా నియమించారు. అతనికి పాఠశాలలోని అణువణువూ తెలుసు. అంతేకాకుండా.. నిందితుడు నేరస్థుడనే అనుమానాలు ఉన్నాయి.