Leading News Portal in Telugu

Kolkata doctor case: మూడుసార్లు వైద్యురాలి పేరెంట్స్‌కి ఫోన్.. ఒక్కసారి నిజం చెప్పలేదు..


  • కోల్‌కతా వైద్యురాలి ఘటనలో సంచలన విషయాలు..

  • ఘటన తర్వాత తల్లిదండ్రులకు మూడు సార్లు ఆస్పత్రి నుంచి ఫోన్..

  • ప్రతీసారి ఆత్మహత్య అంటూ అబద్ధాలు..
Kolkata doctor case: మూడుసార్లు వైద్యురాలి పేరెంట్స్‌కి ఫోన్.. ఒక్కసారి నిజం చెప్పలేదు..

Kolkata doctor case: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశంలో డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు, మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందని కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. నిందితుడు సంజయ్ రాయ్‌ తన నేరాన్ని సీబీఐ ముందు ఒప్పుకున్నాడు.

అయితే, ఈ ఘటనలో ఆర్ జీ కర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై, ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఇతడిని సీబీఐ వరసగా మూడు రోజుల పాటు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత వైద్యురాలి తల్లిదండ్రులకు మూడుసార్లు ఆస్పత్రి నుంచి ఫోన్ వెళ్లింది. అయితే, ఏ ఒక్కసారి కూడా వారికి నిజాన్ని చెప్పలేదని తెలిసింది. ప్రతీసారి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు తప్పితే ఆమెపై అత్యాచారం జరిగి హత్యకు గురైందనే విషయాన్ని దాచేశారు.

మొదటికాల్‌లో ఆర్‌జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ పేరెంట్స్‌కి ఫోన్ చేసి వారిని వెంటనే రావాల్సిందిగా ‘‘మీ కుమార్తె బాగా లేదు, దయచేసి ఆస్పత్రికి రాగలరా..?’’అని అడిగాడు. డాక్టర్ తండ్రి ఏదో తప్పు జరిగిందని గ్రహించి మరిన్ని వివరాలు అడగటంతో దానికి అతను ‘‘ఆమె బాగాలేదు, మేము ఆమెను అడ్మిట్ చేశాం, నువ్వు త్వరగా రాగలావా..?’’ అని అన్నాడు. మరింత సమాచారం అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు చెబుతారంటూ ఫోన్ పెట్టేశాడు.

రెండవ కాల్‌లో అదే ఆస్పత్రి నుంచి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ..‘‘ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. దయచేసి వీలైనంత త్వరగా రండి’’ అని కోరారు. ఈ కాల్‌లో కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని వైద్యులు వివరిస్తారని చెప్పారు.

మూడో కాల్‌లో సిబ్బంది చాలా ఆందోళనతో ఫోన్ చేసి.. ‘‘ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. ఆమె మరణించి ఉండొచ్చు. పోలీసులు ఇక్కడే ఉన్నారు. అందరి ముందే ఈ కాల్ చేస్తున్నాం’’ అని వైద్యురాలి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రుల్ని మూడు గంటల పాటు బయటే ఉండేలా చేయడం, ఆ తర్వాతే బాధితురాలి మృతదేహాన్ని చూపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ దారుణమైన సంఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.