- హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో సంచలన ఘటన
-
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని కొట్టి హత్య -
గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురు అరెస్టు -
బాధితుడు సబీర్ మాలిక్‌గా గుర్తింపు.. ఆగస్టు 27న హత్య.

హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని కొట్టి చంపినందుకు గాను గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఫ్ మాంసం తిన్నాడనే అనుమానంతో నిందితులు సబీర్ మాలిక్‌ను ఆగస్టు 27న హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అభిషేక్, మోహిత్, రవీందర్, కమల్జీత్, సాహిల్ ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను విక్రయిస్తామనే నెపంతో సాబీర్ మాలిక్‌ను ఒక దుకాణానికి పిలిపించారు. అక్కడ నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు.
బాధితుడిని కొట్టడం చూసి స్థానికులు కొందరు జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కొట్టొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో నిందితులు బాధితుడిని వేరే చోటికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి సబీర్ను మళ్లీ దారుణంగా కొట్టారు. దీంతో.. అక్కడ సబీర్ మరణించాడు. కాగా.. బాధితుడు మాలిక్ చర్కీ దాద్రీ జిల్లాలోని బాంద్రా గ్రామ సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నాడు. అతను తన జీవనోపాధి కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు అమ్ముకుని బతికేవాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.
2023లో హర్యానాలోని భివానీ జిల్లాలోని లోహారులో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు నసీర్, జునైద్‌లను హర్యానాలోని లోహారులో కిడ్నాప్ చేసి కారులో తగులబెట్టారు. అనంతరం.. పూర్తిగా కాలిపోయిన వాహనంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.