Leading News Portal in Telugu

Kolkata Murder Case : కోల్ కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. వచ్చే మంగళవారానికి వాయిదా


Kolkata Murder Case : కోల్ కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. వచ్చే మంగళవారానికి వాయిదా

Kolkata Murder Case : ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు తదుపరి విచారణ నేడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవరును సమర్పించారు. అందులో ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ ఘటనకు నిరసనగా వైద్యుల సమ్మెలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణను వచ్చే మంగళవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఘటనాస్థలంలో సేకరించిన సాంపిల్స్​పై సీబీఐ అనుమానం వ్యక్తం చేయగా.. వచ్చే మంగళవారంలోపు ఈ కేసుకు సంబంధించిన కొత్త స్టేటస్​ రిపోర్ట్​ని సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ను మళ్ళీ ఫైల్ చెయ్యాలని సుప్రీం కోర్ట్ సీబీఐని ఆదేశించింది. సీబిఐ విచారణ కు మరో వారం రోజుల గడువు ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ అధికారులకు సహకరించటం లేదని సోలిసిట్ జనరల్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా అర్జీ కార్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు, మెడికల్ కాలేజ్, ఇందిరా మైత్రి సదన్ ల వద్ద సీఐఎస్ఎఫ్ అధికారులు వసతి కల్పించాలని ఆదేశించింది. అర్జీ కార్ ఆస్పత్రి వద్ద డాక్టర్ల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. రక్షణ చర్యల పై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చామని బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఈ కేసు మొదటి విచారణ ఆగస్టు 22 న జరిగింది. ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది. గత విచారణలో, డాక్టర్లు, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సీఐఎస్‌ఎఫ్‌ని ఆదేశించింది. అదే సమయంలో, ఆగస్టు 15 న ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన మూక హింస, విధ్వంసంపై దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని సిబిఐతో పాటు బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా కోర్టు కోరింది.

కాగా, భారతీయ ప్రవాసులు ఆదివారం 25 దేశాల్లోని 130 నగరాల్లో నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం,హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న జరిగిన ఈ దారుణ ఘటనకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా అర్ధరాత్రి కోల్‌కతాలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు మానవ హారాలుగా ఏర్పడి మూడవ ‘రీక్లెయిమ్ ది నైట్’ నిరసన మార్చ్‌లో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ, “బెంగాల్ ముఖ్యమంత్రి వల్ల ప్రయోజనం లేదు. ఆమె తన కుర్చీని కాపాడుకోవడం గురించి మాత్రమే ఆందోళన చెందుతుంది. మాకు న్యాయం జరగకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామన్నారు. కోల్‌కతా పోలీసులు తమ కుమార్తెను హడావుడిగా దహన సంస్కారాలు చేయడాన్ని దాచేందుకు తమకు లంచం ఇచ్చారని బాధితురాలి తల్లిదండ్రులు ఇటీవల చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సెప్టెంబర్ 17న కలకత్తా హైకోర్టులో నివేదికను సమర్పించనుంది.