Leading News Portal in Telugu

Vladimir Putin: నా ప్రియ మిత్రుడు మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం..


  • రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..

  • జెలెన్‌ స్కీతో ప్రధాని మోడీ జరిపిన చర్చల సారాంశాన్ని పుతిన్ కు వివరించిన అజిత్ దోవల్..

  • నా ప్రియ మిత్రుడు ప్రధాని మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం: వ్లాదిమిర్ పుతిన్
Vladimir Putin: నా ప్రియ మిత్రుడు మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం..

Vladimir Putin: బ్రిక్స్‌ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ వర్గ్‌లో వ్లాదిమీర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసింది. ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నా స్నేహితుడి రాక కోసం ఎదురు చూస్తున్నాం.. ఆయనకు నా శుభాకాంక్షలు అని రష్యా మీడియా సమావేశంలో అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చారు.

అయితే, గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌ స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్‌ దోవాల్‌ రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు వివరించారు. మోడీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్‌ దోవాల్‌ పేర్కొన్నారు. ఈ చర్చల్లో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్‌ వేదికగా బ్రిక్స్‌ దేశాల సదస్సు కొనసాగనుంది. ఆ సదస్సుకు మోడీ వస్తే, ఆయనతో విడిగా సమావేశం కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు వ్లాదిమిర్ పుతిన్‌ చెప్పారు. ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రసారం చేసింది.

కాగా, నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్‌ – రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22వ తేదీన ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని వ్లాదిమిర్ పుతిన్ ప్లాన్ చేశారని రష్యన్ ఎంబసీ పేర్కొనింది. అయితే, ఉక్రెయిన్‌ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లొదిమీర్‌ జెలెన్‌ స్కీతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఇరు దేశాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్‌ క్రియాశీల పాత్ర పోషించడానికి రెడీగా ఉందని నరేంద్ర మోడీ అన్నారు.