Leading News Portal in Telugu

Water Leakage At Taj Mahal: తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకేజీ


  • ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో తాజ్ మహల్ ఒకటి..

  • ఢిల్లీలో భారీ వర్షాలతో తాజ్ మహల్లోని ప్రధాన గోపురంలో నీటి లీకేజీ..

  • ప్రధాన గోపురంకు ఎటువంటి నష్టం జరగలేదు: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
Water Leakage At Taj Mahal: తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకేజీ

Water Leakage At Taj Mahal: దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది. 17వ శతాబ్దపు సమాధికి ఆనుకుని ఉన్న తోట మునిగిపోయినప్పటికీ.. ప్రధాన గోపురానికి ఎటువంటి నష్టం జరగలేదు అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తెలిపింది. ఇక, 17వ శతాబ్దానికి చెందిన తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా ఉంది. ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. తాము తాజ్ మహల్ ప్రధాన గోపురంలో నీటి లీకేజీని చూశాము.. కానీ తనిఖీ చేసినప్పుడు.. ప్రధాన గోపురంకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి ప్రధాన గోపురం మొత్తం తనిఖీ చేసామన్నారు.

ఇక, ప్రధాన గోపురంలో నీటి లీకేజీని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. వరదలతో నిండిన మహల్ తోట దృశ్యాలు స్థానికులతో పాటు పర్యాటకులలో ఆందోళనలకు దారి తీశాయి. స్మారక చిహ్నంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, ఆగ్రాలో గురువారం 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.. గత 80 ఏళ్లలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది అని చెప్పారు. జాతీయ రహదారి ఒకటి జలమయం కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.. ఆగ్రాలోని అన్ని పాఠశాలలను అధికారులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.