Leading News Portal in Telugu

Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..


  • మరోసారి కేరళలో నిపా కలకలం..

  • మలప్పురంలో వైరస్‌తో 24 ఏళ్ల వ్యక్తి మృతి..

  • మాస్కులు తప్పనిసరి.. థియేటర్లు.. విద్యాసంస్థలు బంద్..
Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..

Nipah Virus: నిపా వైరస్ కేరళని మరోసారి భయపెడుతోంది. మలప్పురం జల్లాలో 24 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మరణించాడు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగం నిపా మరణాన్ని ధ్రువీకరించిన తర్వాత ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మలప్పురం జిల్లాలోని తిరువల్లి గ్రామపంచాయతీ, మంపట్ గ్రామపంచాయతీ లోని పలు వార్డుల్లో ఆంక్షలు విధించారు.

మాస్కుల్ని తప్పనిసరి చేయడంతో పాటు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా బహిరంగ సభల్ని పరిమితం చేశారు. పాల పంపిణీ, వార్తా పత్రిక, కూరగాయల అమ్మకాల వంటి అత్యవసరమైన సేవలను మినహాయించి, వ్యాపారాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతించారు. మెడికల్ దుకాణాలకు మినహాయింపులు ఇచ్చారు. విద్యాసంస్థలు, మదర్సాలు, అంగన్వాడీలతో సహా సినిమా థియేటర్లు అన్నీ మూతపడ్డాయి.

వ్యక్తులు భౌతిక దూరం పాటించడంతో పాటు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేసుకోకుండా, ఆరోగ్య అధికారుల్ని సంప్రదించాలని కోరారు. ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్త వహించాలని, ముక్యంగా పక్షలు, జంతువులు కొరికిన, చెట్ల నుంచి రాలిపోయిన పండ్లను తినొద్దని హెచ్చరించారు. తినడానికి ముందు అన్ని పండ్లను, కూరగాయల్ని బాగా కడగాలని సూచించారు. మలప్పురంలో నిపా వైరస్ కేసులు పెరగడం, జిల్లాలో రెండో మరణం సంభవించడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల 24 ఏళ్ల వ్యక్తి మరణించడానికి నిపా వైరస్ కారణమని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు.