Leading News Portal in Telugu

Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..


  • రాహుల్ గాంధీ ‘సిక్కు’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫైర్..

  • అతడిది జిన్నా మనస్తత్వమని విమర్శలు..

  • తనకు దక్కకుంటే నాశనం చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఆగ్రహం..
Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..

Hardeep Singh Puri: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సిక్కు సంఘాలతో పాటు బీజేపీ మండిపడుతోంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. అతను భారతదేశంలో సిక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఎవరి ప్రభుత్వ హాయంలో సిక్కుల ఊచకోత జరిగిందో అంతర్మధనం చేసుకోవాలని హితవు పలికారు. కోరుకున్నది దక్కాలి లేకపోతే నాశనం కావాలనే పాకిస్తాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా మనస్తత్వం రాహుల్ గాంధీకి ఉందని ఆయన విమర్శించారు. దేశం విచ్ఛిన్నం కావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడని పూరి అన్నారు.

రాహుల్ గాంధీ సిక్కు వర్గంపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంతి..తాను 62 ఏళ్లుగా తలపాగా ధరిస్తున్నానని చెప్పారు. అతడు అజ్ఞానంతో చేసిన ప్రకటన అని, ‘‘పప్పు’’ స్టైల్ అని చెప్పడం మరింత కలవరపెట్టే ధోరణి అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలియదని చెప్పారు. సిక్కులకు అస్థిత్వ ముప్పు 1984లో ఏర్పడింది చెప్పారు. ఈ ఏడాది సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఈ మారణహోమంలో 3000 మంది చంపబడ్డారు.