Leading News Portal in Telugu

Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!


  • మిస్‌ యూనివర్స్‌ ఇండియాగా రియా
  • మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం
  • 16 ఏళ్ల వయసులో మోడలింగ్ కెరీర్‌
Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Meet Miss Universe India 2024 Rhea Singha: ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా’ 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్‌ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం దక్కించుకున్నారు. 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా.. ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్’ 2024 పోటీలో భారతదేశం తరపున రియా పాల్గొననున్నారు. మిస్‌ యూనివర్స్‌ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ రియా సింఘా ఎవరా? అని అందరూ వెతుకున్నారు.

19 ఏళ్ల రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఈస్టోర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకుడు బ్రిజేష్ సింఘా, రీటా సింఘా దంపతుల కుమార్తె రియా. జీఎల్‌ఎస్ యూనివర్సిటీ గుజరాత్‌లో రీటా చదువుతున్నారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. రియా తన మోడలింగ్ కెరీర్‌ను 16 సంవత్సరాల వయస్సులో 2020లో ప్రారంభించారు. ఆ ఏడాది ‘దివాస్ మిస్ టీన్ గుజరాత్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

2023 ఫిబ్రవరి 28న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023లో రియా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 25 మంది అభ్యర్థులతో పోటీపడి టాప్ 6లో నిలిచారు. 2023 ఏప్రిల్ 19న ముంబైలో జరిగిన జాయ్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొన్నారు. 19 మందితో పోటీపడి రన్నరప్‌గా నిలిచారు. 2024 సెప్టెంబర్ 22న మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీలో రియా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 43 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగనుంది.