- బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో కీలక పరిణామం..
-
హత్యలో సహోద్యోగి పాత్ర.. -
వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంపై హెచ్చరించినట్లు సమాచారం.. -
అతడే ప్రధాన నిందితుడి అనుమానిస్తున్న పోలీసులు..

Bengaluru woman Murder: బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. బాధితురాలు అద్దెకు ఉంటున్న నివాసంలోని ఫ్రిజ్‌లో ఆమె తెగిపడిన శరీర భాగాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అత్యంత కిరాతకంగా మహాలక్ష్మీని నరికి 52 భాగాలు చేశాడు. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. మరో శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ ఘటన జరిగింది. గది నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మితో పనిచేసే సహోద్యోగికి ఈ హత్యలో కీలక పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. సహోద్యోగిని ‘‘ముక్తి’’గా గుర్తించారు. ఇతని ఇంటి పేరుని పోలీసులు వెల్లడించలేదు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. మహాలక్ష్మీ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ముక్తి వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే, ఈ వేరే వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
ఈ కేసులో మహాలక్ష్మీకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో అప్పటికే వివాహమై ఓ పాప కూడా ఉంది. అయితే, హేమంత్ దాస్ ఆమె హత్యకు ‘‘అష్రాఫ్’’ అనే వ్యక్తి కారణమని ఆరోపించాడు. ఆమెకు, అష్రాఫ్‌తో అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఒడిశాకు చెందినవాడని, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, స్పష్టంగా నిందితుడు ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియరాలేదు.