Leading News Portal in Telugu

Mohamed Muizzu: భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..


  • ఇండియాకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ..

  • ఈ ఏడాదిలో రెండోసారి పర్యటన..
Mohamed Muizzu: భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..

Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్‌-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.

న్యూఢిల్లీ చేరుకున్న ముయిజ్జూకి కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కిరిటీ వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్వు అదికారిక ఆహ్వానం మేరకు ముయిజ్జూ అక్టోబర్ 6-10 మధ్య భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సందర్భంగా, ముయిజ్జూ మాట్లాడుతూ.. తాను వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఉన్నాయని ప్రశంసించారు. అంతకుముందు, జూన్ నెలలో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ ఏడాదిలో భారత్‌ని సందర్శించడం ఇది రెండోసారి.

నిజానికి కొత్తగా ఎన్నికైన ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా ముందుగా భారత పర్యటకు వచ్చేవాడు. అయితే, ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చిన మహ్మద్ ముయిజ్జూ.. తన తొలి పర్యటనని చైనాలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత టర్కీ వెళ్లాడు. ఇప్పుడు ఇండియాకు వచ్చాడు. దీంతో పాటు ఈ ఏడాది ప్రధాని లక్షదీవుల పర్యటనకు వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు మోడీనిపై అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో ఇండియా ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. బాయ్ కాట్ మాల్దీవిస్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీని తర్వాత మాల్దీవుల్లో పర్యాటక రంగం పడిపోయింది. ఆ తర్వాత విషయం అర్థమైన మాల్దీవులు, ఇండియాతో మళ్లీ స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ముయిజ్జూ పర్యటన సాగబోతోంది.