Leading News Portal in Telugu

Kolkata: ఉధృతమవుతున్న జూడాల నిరసన.. మద్దతుగా మరో 60 మంది డాక్టర్ల రాజీనామా


  • కోల్‌కతాలో ఉధృతమవుతున్న జూడాల నిరసన

  • మద్దతుగా మరో 60 మంది డాక్టర్ల రాజీనామా
Kolkata: ఉధృతమవుతున్న జూడాల నిరసన.. మద్దతుగా మరో 60 మంది డాక్టర్ల రాజీనామా

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా మంగళవారం 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. బుధవారం కూడా మరో 60 మంది సీనియర్ వైద్యులు రిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Caec

కోల్‌కతా ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న విధుల్లో చేరారు. అయితే తమ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేవని, మృతురాలికి న్యాయం జరగాలంటూ ఏడుగురు జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ వైద్య కళాశాలల్లో మూకుమ్మడి రాజీనామాలు చోటుచేసుకున్నాయి.

ఇది కూడా చదవండి: Kerala: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ శ్రీలేఖ

ఇదిలా ఉంటే వైద్యులు ఆందోళనకు దిగడంతో రోగులకు వైద్య సేవలు అందడంలో లేదు. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా దసరా పండుగ సీజన్ కావడంతో ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా వైద్యులంతా మద్దతు నిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మరోసారి కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన తీవ్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Women’s T20 World Cup: హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి, హర్మన్ ప్రీత్.. భారత్ భారీ స్కోర్