Leading News Portal in Telugu

Delhi: గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు! ఏఏ రాష్ట్రాలంటే..!


  • గవర్నర్లు…. లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు!

  • నవంబర్‌లో మార్పులు జరిగే అవకాశం
Delhi: గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు! ఏఏ రాష్ట్రాలంటే..!

గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పని చేసిన గవర్నర్లను బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ.. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారు. ఈయనను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.

బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను జమ్మూకాశ్మీర్‌కు పంపిచే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్నాయి. ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఐదు ఏళ్లకుపైగా కేరళ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా వేరే పదవి ఇచ్చే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి పదవీ విరమణ చేయొచ్చని సమాచారం.

ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా మూడేళ్లకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్‌కు సంబంధించి 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐదేళ్లు… తమిళనాడు ఆర్‌ఎన్‌ రవి, గోవా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై మూడేళ్లుగా గవర్నర్ పదవిలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్‌ బీజేపీ నేతలను గవర్నర్‌ లేదా ఎల్‌జీలుగా నియమించే అవకాశం ఉంది. మాజీ ఎంపీలు అశ్వనీ చౌబే, వీకే సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ జాబితాలో ఉన్నారు.