Leading News Portal in Telugu

Dana Cyclone Alert: ఏపీ సహా పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన


Dana Cyclone Alert: ఏపీ సహా పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన డానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈనెల 23న తుఫాన్ తీరం దాటనుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 23-25న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మిజోరాం, మేఘాలయలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు స్పష్టం చేశాయి. ఫైర్ సర్వీస్, శాంతిభద్రతల అదనపు డీజీతో సమీక్ష నిర్వహిస్తామని ఒడిశా రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.