Leading News Portal in Telugu

Bengaluru: బెంగళూరును ముంచెత్తిన భారీ వరద.. 27 ఏళ్ల రికార్డ్‌ను బద్ధలుకొట్టిన వర్షం


  • బెంగళూరును ముంచెత్తిన భారీ వరద

  • 27 ఏళ్ల రికార్డ్‌ను బద్ధలుకొట్టిన వర్షం

  • జనజీవనం అస్తవ్యస్థం.. ఆస్తులు ధ్వంసం
Bengaluru: బెంగళూరును ముంచెత్తిన భారీ వరద.. 27 ఏళ్ల రికార్డ్‌ను బద్ధలుకొట్టిన వర్షం

టెక్ సిటీ బెంగళూరును భారీ వరద ముంచెత్తింది. మంగళవారం రికార్డ్ స్థాయిలో వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిన్నెలతో నీళ్లు బయటకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది రోజులుగా బెంగళూరులో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే రికార్డు స్థాయిలో వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి 186.2 మి.మీ వర్షం పాతం నమోదైనట్లు పేర్కొంది. అక్టోబర్ 1, 1997లో 178.9 మి.మీ వర్షం పాతం నమోదైంది. తిరిగి 27 ఏళ్ల తర్వాత ఆ రికార్డును మంగళవారం తిరగరాసింది. ఈ రోజంతా కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

యలహంకలో తీవ్ర వరదలు..
యెలహంకలో కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వారం వ్యవధిలో వరదలకు గురవడం ఇది రెండోసారి. కాంప్లెక్స్‌లోని నివాసితులు మంగళవారం ఉదయం నడుము లోతులో నీరులో మునిగిపోయారు. కార్లు మరియు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బెంగళూరులో ఎటుచూసినా నీళ్లే ఉన్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. వరద నీటిలో ప్రజాప్రతినిధుల ఇళ్లు కూడా మునిగిపోయాయి.