Leading News Portal in Telugu

BJP alleges Dalits insulted, cites Kharge’s viral Wayanad video


  • మల్లికార్జున ఖర్గే వయనాడ్ వీడియో వైరల్..

  • ప్రియాంకా నామినేషన్ సమయంలో గేట్ వద్దనే ఖర్గే..

  • దళితులను అగౌరపరిచారని బీజేపీ ఫైర్..
BJP: కాంగ్రెస్ ఖర్గేని అవమానించింది.. సోనియా, రాహుల్‌పై బీజేపీ ఫైర్..

BJP: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రియాంకాగాంధీ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. నామినేషన్ వేస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గేని అనుమతించలేదని, గేటు వద్దే ఉంచారని చూపిస్తున్న వీడియో వైరల్‌పై బీజేపీ స్పందించింది. దళితుల పట్ల కాంగ్రెస్ అగౌరవంగా వ్యవహరించిందని బీజేపీ విమర్శలు గుప్పించింది.

‘‘ఈ రోజు వయనాడ్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్, దళిత నాయకుడిని అగౌరవించడం చాలా నిరుత్సాహపరుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడైనా, పీసీసీ అధ్యక్షుడైనా ఆ కుటుంబం కేవలం రబ్బరు స్టాంపుగా భావించి, వారిని అవమానించి గర్వపడుతుందా..? ’’ అని బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ సోనియా, రాహుల్ గాంధీలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ప్రియాంకాగాంధీ నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ చీఫ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. కుమారి సెల్జా, సీతారాం ఏచూరిలను కాంగ్రెస్ ఇలాగే అవమానించిందని, కాంగ్రెస్ అంబేద్కర్‌ని కూడా అగౌరపరిచిందని, రాహుల్ గాంధీ రిజర్వేషన్లను ముగిస్తానని చెప్పాడని ఆయన ఆరోపించారు.