Leading News Portal in Telugu

CPI Narayana is serious about Air Ticket Prices


  • విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్
  • కేంద్ర మంత్రికి లేఖ
  • ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం
CPI Narayana: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నారాయణ సీరియస్

CPI Narayana: విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ అయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నాయని మండిపడ్డారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్ ధరలు నిర్ణయించాలన్నారు. విమానయాన టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండాలన్నారు. విమానయాన శాఖ ప్రజల కోసం పని చేయాలని చెప్పారు. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న ఆయన.. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తుంటే ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

సైకలాజికల్ టెర్రర్‌కు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇంటెలిజెన్స్ వైఫల్యమని ఆయన ఆరోపించారు. విమానయాన సంస్థల టికెట్లు ధరలను నియంత్రించకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందన్నారు. ప్రపంచంలో హంగర్ ఇండెక్స్‌లో ఇండియా 112వ స్థానంలో ఉందన్నారు. ట్రైన్‌లో సహితం వందే భారత్ పేరిట టికెట్ల రేట్లు పెంచారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.