Leading News Portal in Telugu

Pappu Yadav’s estranged wife distances from his statement on Lawrence Bishnoi


  • లారెన్స్ బిష్ణోయ్‌పై ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలు..

  • పప్పూ యాదవ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న భార్య..

  • గత కొంత కాలంగా విడిగా ఉంటున్న ఎంపీ రంజీత్ రంజన్..
Pappu Yadav: ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రకటనతో నాకు సంబంధం లేదు.. పప్పూ యాదవ్ భార్య..

Pappu Yadav: ఇటీవల కాలంలో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ దేశవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతున్నాడు. ముంబైలో ఎన్సీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని చంపిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇస్తే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్‌వర్క్‌ని 24 గంటలో తుదిచిపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్‌కి ఫోన్ రావడంతో తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని వేడుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే, పప్పూ యాదవ్‌ భార్య మాట్లాడుతూ.. తన భర్త చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అన్నారు. కొంత కాలంగా పప్పూ యాదవ్‌తో విడిపోయి ఉంటున్న అతని భార్య రంజీత్ రంజన్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణజింకల్ని చంపడంపై సల్మాన్ ఖాన్‌కి పప్పూ యాదవ్ సంఘీభావం ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే పప్పూ యాదవ్ ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు.

అతని భార్య రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘పప్పు జీ,నాకు వేర్వేరు రాజకీయాలు ఉన్నాయి, మా మధ్య విభేదాలు ఉన్నాయి. గత ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాలుగా మేము విడిగా ఉంటున్నాము’’ అని చెప్పారు. అతను ఏ ప్రకటన చేసినా, నాకు నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. ఈ పరిణామాలను శాంతిభద్రతల విషయంగా పేర్కొన్న ఆమె, ప్రభుత్వం దీనిని పరిశీలించాలని కోరారు.

అంతకుముందు, బాబా సిద్ధిక్ మరణం తర్వాత పప్పూ యాదవ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ముంబై నుంచి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా సల్మాన్ ఖాన్‌ని కలవలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత తనకు 24 గంటల సమయం ఇస్తే బిష్ణోయ్ గ్యాంగ్ లేకుండా చేస్తానని అన్నారు. ఆ తర్వాత నుంచి వరసగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్ బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు తనకు ఉన్న వై సెక్యూరిటీని, జెడ్ సెక్యూరిటీకి అప్‌గ్రేడ్ చేయాలని కోరాడు. పోలీస్ ఎస్కార్ట్ కావాలని డిమాండ్ చేశాడు. నేను హత్యకు గురైతే ఆ నింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుందని అన్నారు.